ఈ మంత్రిగారికి ఏమయింది?

by admin
2 views

పప్పుదినుసుల ధర ఆకాశానంటున్న నేపథ్యంలో సామాన్యులంతా గగ్గోలు పెడుతున్నారు. పప్పుదినుసుల ధరలో కిలో రూ.200 తాకుతుండటం టమాటా మాట కూడా కిలో రూ.80కి పైగానే ఉండటం సామాన్య ప్రజలను కలవరపెడుతోంది.

ఏం కొనేటట్లు లేదు…ఏం తినేటట్లు లేదంటూ వాపోతున్న సమయంలో  కేంద్రప్రభుత్వం దానిపై దృష్టి సారించింది. అయితే ఈ విషయాన్ని ప్రకటిస్తూ కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ దెప్పిపొడుపు వ్యాఖ్యలు చేశారు. ప్రచారం చేయడం వల్లే పప్పుల ధరలు పెరుగుతున్నాయని తేల్చేశారు.

ధరల పెరుగుదలపై రాంవిలాస్ పాశ్వాన్ మీడియాతో మాట్లాడుతూ టమాటా బంగాళదుంప ఉత్పత్తి బాగానే ఉన్న ధరలు ఆకాశాన్నంటుతున్నాయంటే అందుకు కారణం వదంతులే అని పేర్కొన్నారు. వాటి వినియోగంలో కూడా పెద్దగా మార్పులేదని చెప్పిన ఆయన…ఇంకా ధరలు పెరుగుతూనే ఉన్నాయంటే అందుకు కారణం రూమర్సేనంటూ తేల్చి పారేశారు. పాశ్వాన్ వ్యాఖ్యాలతో అవాక్కవడం విలేకరుల వంతయింది. ఇక ప్రభుత్వ చర్యల గురించి ఆయన వివరిస్తూ దేశంలో పప్పు దినుసుల ఉత్పత్తి క్రమంగా తగ్గుతూ వస్తోందని సరైన వర్షాలు లేకపోవడం ఇందుకు కారణమన్నారు. మొజాంబిక్ – మయన్మార్ దేశాల్లో పప్పుదినుసులు పండించేందుకు ఆ దేశప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపే ఆలోచనలో కేంద్రం ఉందని అన్నారు. ఇందుకు భారత్ నుంచి ఆ రెండు దేశాలకు రెండు బృందాలను పంపనున్నట్లు  తెలిపారు.

You may also like